హైదరాబాద్ 27°C
అమరావతి 32°C
IST 8:46 AM
శనివారం జూలై 11 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

పత్తి పంటలో రసం పీల్చే పురుగుల నివారణ: శాస్త్రవేత్త సూచనలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పత్తి పంటలో రసం పీల్చే పురుగుల నివారణ: శాస్త్రవేత్త సూచనలు
📷 Sachin Mamtora / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలుగు రాష్ట్రాల్లో పత్తి పంట తొలిదశలో ఉండగా, రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువైంది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు.

పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శైల మాట్లాడుతూ, పత్తిలో ప్రధానంగా పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు, పిండినల్లి, తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగులు ఆశించి ఆకులను పసుపు పచ్చగా మార్చడం, ముడుచుకోవడం, పెలుసుబారడం, కాయలు రాల్చడం వంటి నష్టం కలిగిస్తాయని వివరించారు. తామర పురుగులు పంటకు టొబాకో స్ట్రీక్ వైరస్ వ్యాప్తి చేస్తాయని, ఇవి కలుపు మొక్కల్లో పెరిగే అవకాశం ఉన్నందున గట్లు, పొలం చుట్టూ కలుపు మొక్కలను ఏరివేయాలన్నారు.

సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగంగా, తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. విత్తన శుద్ధి చేసిన విత్తనం వాడితే మొదటి 30 రోజుల పాటు పురుగుల నుంచి రక్షణ లభిస్తుంది. నత్రజని సిఫారసు మేరకే వాడాలి, అధికంగా వాడితే పురుగుల ఉదృతి పెరుగుతుంది. పంట మధ్యలో కంది, పెసర, మినుము వంటి అంతరపంటలు వేసుకుంటే మిత్ర పురుగుల సంఖ్య పెరిగి కొంత నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.

పురుగుల ఉదృతిని గమనించేందుకు ఎకరానికి 10 చొప్పున పసుపు జిగురు అట్టలు (తెల్లదోమ), తెలుపు/నీలి రంగు అట్టలు (తామర) ఏర్పాటు చేసుకోవాలి. తొలిదశలోనే వేపనూనె (1500 ppm) ని ఎకరాకు లీటరు చొప్పున (5 ml/లీ) పిచికారీ చేస్తే పురుగులు రసం పీల్చడం, గుడ్లు పెట్టడం తగ్గుతుంది. 30, 45 రోజుల దశలో కాండానికి మోనోక్రోటోఫాస్ 1:4 నిష్పత్తిలో, 60 రోజుల దశలో ఇమిడాక్లోప్రిడ్ లేదా ఫ్లోనికామీడ్ 1:20 నిష్పత్తిలో మందు పూయాలి. ఉదృతి ఇంకా ఎక్కువగా ఉంటే తయోమిథాక్సామ్, ఆష్టమాప్రిడ్, ఫిప్రోనీల్+ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్ మందులు, తామర ఎక్కువైతే సల్ఫాక్సాఫ్లోర్ వంటివి ఉదృతిని బట్టి మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలని డాక్టర్ శైల సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com