ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఉత్తరాఖండ్, హిమాచల్‌లో వరద హెచ్చరిక
ఉత్తరాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వానలతో జనజీవనం స్తంభించింది.
ఉత్తరాఖండ్‌లో అలకనంద, మందాకిని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జాకోలిలో 50 మిమీ, ఉఖీమఠ్‌లో 20 మిమీ వర్షపాతం నమోదైంది. రిషికేశ్‌లోని త్రివేణి ఘాట్ వద్ద గంగా నది నీటి మట్టం పెరుగుతోంది. దీంతో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బద్రీనాథ్ సహా పలు మార్గాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్‌లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ కుండపోత వర్షాలు పడుతున్నాయి. సిమ్లాతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలు దెబ్బతిన్నాయి. కులు, మండి, కిన్నౌర్, హమీర్పూర్, చంబా జిల్లాల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని IMD తెలిపింది.
నైరుతి రుతుపవనాలు రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీలోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. జూలై 9 వరకు దేశంలో సాధారణ వర్షపాతం 73.8 మిమీ ఉండగా, ఈ సారి 101.9 మిమీ నమోదైంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com