ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్రం: ఐటీఓ వద్ద AQI 414 పాయింట్లు
ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయికి చేరింది. నగరంలోని ఐటీఓ (ITO) ప్రాంతంలో గాలి నాణ్యత సూచి (AQI) 414 పాయింట్లకు చేరుకుంది. దీన్ని 'తీవ్రం' (severe) విభాగంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వర్గీకరించింది.
దట్టమైన పొగమంచుతో పాటు కాలుష్య కారకాలు నగరమంతా వ్యాపించాయి. దీంతో శ్వాసకోస సమస్యలు, కళ్ల మంట, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు N95 మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వారు సూచించారు. చిన్న పిల్లలు, వృద్ధులు, ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు చెప్తున్నారు.
ఢిల్లీలో కాలుష్యం రాజకీయ అంశంగా కూడా మారింది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కాలుష్యాన్ని నియంత్రించలేదని BJP ఆరోపించేది. ప్రభుత్వం మారిన సుమారు ఏడాదిన్నర తర్వాత కూడా కాలుష్య స్థాయిల్లో పెద్దగా మార్పు లేదు. ముఖ్యంగా దీపావళి తర్వాత కాలుష్య స్థాయిలు మరింత పెరిగాయి.
రాజధానిలోని ప్రధాన ప్రాంతాల్లో విద్యార్థి, యువజన సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. పరిశ్రమల ఉద్గారాలు, నిర్మాణ వ్యర్థాల ధూలి, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనంపై కఠిన ఆంక్షలు విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రద్దీ సమయాల్లో కాలుష్య డేటా సరిగ్గా నమోదు కావట్లేదని, పారదర్శకత లోపించిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కాలుష్యం పెరగడంతో ఢిల్లీలో మూడో దశ ప్రతిస్పందన నిబంధనలు అమలు చేశారు. వాటి ఫలితం ఇంకా కనిపించలేదు. ప్రజలు మాస్కులు ధరించి బయటకు వెళ్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com