డీఎస్పీ భీమరెడ్డి అరెస్ట్; 300 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించిన ఏసీబీ
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పని చేస్తున్న శంకిరెడ్డి భీమరెడ్డిని యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు. నిన్న (సోమవారం) ఉదయం హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
సోదాల్లో విల్లాలు, పెంట్‌హౌస్‌లు, ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాలు, ఖాళీ ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను ఏసీబీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. హైదరాబాద్ నర్సింగ్‌లోని వెసెల్లా మిడాస్‌లో ఉన్న భీమరెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు జరిగాయి. ఇబ్రహీంబాగ్‌లోని వెస్సలా మెడోస్‌లో విల్లా, టెలికాం నగర్‌లో 2 పెంట్‌హౌస్‌లు, గచ్చిబౌలిలో ఫ్లాట్, మణికొండ లాంకోహిల్స్‌లో 500 గజాల స్థలంలో 5 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్, మణికొండలో 3000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ వంటి ఆస్తులను గుర్తించారు.
వీటితో పాటు తెల్లాపూర్‌లో రెండు ప్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ సమీపంలో 500 గజాల ప్లాట్, నాగోల్ కామినేని ఆసుపత్రి సమీపంలో 200 గజాల ప్లాట్, పొటాంచెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీలో 400 గజాల ప్లాట్, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 1000 గజాల స్థలం డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి, బెంగళూరు దేవనహళ్లిలో ఎకరం భూమి, ముచ్చింతలలో 4.22 ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్‌లో రూ.75 లక్షల పెట్టుబడి పెట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ సోదాల్లో రూ.40 లక్షలకు పైగా నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులను సీజ్ చేసినట్లు ఏసీబీ ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తుండగా, పూర్తి స్థాయి లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. డీఎస్పీ భీమరెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com