జాతీయం

2028 నుంచి ఢిల్లీలో పెట్రోల్ వాహనాలకు స్వస్తి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
2028 నుంచి ఢిల్లీలో పెట్రోల్ వాహనాలకు స్వస్తి
📷 Leandro Paes Leme / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉందని అందరికీ తెలిసిన విషయమే. దాన్ని నివారించడానికి ఇప్పటివరకు ఎన్నో చర్యలు తీసుకున్నా పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఇప్పుడు ఢిల్లీ సర్కార్ కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రకటించింది. 2030 కల్లా ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2028 నుంచి పెట్రోల్ వాహనాలకు స్వస్తి పలికేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాబోయే సంవత్సరం నుంచి EV వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అనుమతిస్తారు. ప్రత్యేక EV పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై మొదటి తేదీ నుంచి 30 లక్షల లోపు ఉన్న EV వాహనాలన్నిటిపై జీవితకాలపు పన్ను మరియు రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు చేశారు.

ఈ పాలసీ అమలైన తొలి సంవత్సరంలో EV వాహనం కొనుగోలు చేస్తే 30,000 రూపాయల ప్రోత్సాహం ఇస్తారు. రెండో సంవత్సరంలో కొనుగోలు చేస్తే 20,000 రూపాయలు, మూడో సంవత్సరంలో కొనుగోలు చేస్తే 10,000 రూపాయల ప్రోత్సాహం అందిస్తారు.

ఆటోల విషయానికి వస్తే తొలి సంవత్సరంలో కొనుగోలు చేస్తే 50,000 రూపాయలు, రెండో సంవత్సరంలో 40,000 రూపాయలు, మూడో సంవత్సరంలో 30,000 రూపాయల ప్రోత్సాహం ఇస్తారు. 2027 జనవరి మొదటి తేదీ నుంచి EV ఆటోలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. CNG మరియు పెట్రోల్ ఆటోలకు రిజిస్ట్రేషన్ నిలిపివేస్తారు.

టూ వీలర్ల విషయంలో 2028 ఏప్రిల్ గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత నుంచి పెట్రోల్ మరియు CNG వాహనాలకు రిజిస్ట్రేషన్ ఉండదు. EV వాహనాల వైపు పూర్తిగా మళ్ళడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని సర్కార్ భావిస్తోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com