భద్రాచలంలో గోదావరి వరద: ఆలయాలు మునిగిపోయాయి, 49 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
భద్రాచలం వద్ద గోదావరి నది వరద ఉదృతి పెరిగింది. ప్రస్తుతం నీటి మట్టం 55.30 అడుగులకు చేరింది. ఇది మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి (53 అడుగులు) దాటినట్లు అధికారులు తెలిపారు. దిగువ ప్రాంతాలకు 15.53 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.
గోదావరి నదీ తీరంలోని స్నాన ఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయంలోకి వరదనీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు గోదావరిలో స్నానాలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
పట్టణ శివార్లోని చెర్ల రోడ్డు, ఏపీ సరిహద్దులోని ఏటపాక పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్లపైకి వరదనీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూనవరం రోడ్డులోని కొత్త కరకట్ట వద్ద జాతీయ రహదారిపై కూడా వరదనీరు వచ్చింది. పట్టణంలోకి నీరు ప్రవేశించకుండా అధికారులు రహదారులపై తాత్కాలిక అడ్డుకట్టలు ఏర్పాటు చేశారు. భద్రాచలం నుండి చింతూరు, కూనవరం వెళ్ళే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నారు.
ఇప్పటికే 49 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల గ్రామ ప్రజలను ఆ కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి భారీ వరద వస్తున్నందున రాత్రి వరకు నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. ప్రజలు చేపల వేటకు లేదా స్నానాలకు నదిలోకి దిగవద్దని, పర్యాటకులు భద్రాచలం రావద్దని పోలీసులు హెచ్చరించారు. జాతీయ రహదారులు మూసివేయడంతో ఛత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వెళ్ళే వాహనాలు దారి మళ్లించారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com