ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం: సమ్మక్క బ్యారేజీ 59 గేట్లు ఓపెన్
ములుగు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లు, తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ 59 గేట్లు తెరిచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. సుమారు 12,60,300 క్యూసెక్ల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది.
వాజేడు మండలం టేకుల గూడెం దగ్గర రహదారిపైకి వరద నీరు రావడంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలం బోదాపురం బ్రిడ్జ్ పైకి వరద నీరు రావడంతో వెంకటాపురం-భద్రాచలం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరుకూరు పెద్ద గోల్లగూడం దగ్గర రహదారి కూడా వరదలో మునిగింది.
వాజేడు మండల కేంద్రంలోని రామాలయం వీధిలో ఇండ్లలోకి వరదనీరు భారీగా చేరింది. అప్రమత్తమైన అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే కొంతమంది బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు నిరాకరించినట్టు సమాచారం. గోదావరి నది ఇంకా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com