హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం, సీఎం విమానం డైవర్ట్
హైదరాబాద్‌లో నిన్న రాత్రి 8 గంటలకు మొదలైన భారీ వర్షం నగరంలోని పలు ప్రాంతాలను జలమయం చేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
చందానగర్, జేఎన్టియు, జీడిమెట్ల, అమీర్పేట్, జూబ్లీ హిల్స్, నాంపల్లి, అబిడ్స్, బషీర్ బాగ్, మియాపూర్, కేపిహెచ్బి, సనత్ నగర్, బోరబండ, పంజాగుట్ట, కోటి, మలక్పేట్, సరూర్ నగర్, చంపాపేట, నారాయణగూడ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మన్సూరాబాద్‌లో ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బంజారా హిల్స్‌లోని వెంగలరావు పార్క్ దగ్గర చెట్లు కూలడంతో పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. రాజేంద్రనగర్‌లో చెట్టు కూలి ఒక కారు ధ్వంసమయింది.
అత్యధిక వర్షపాతం రాజేంద్రనగర్‌లో 7.8 సెంటీమీటర్లు, శాస్త్రిపురం శివరాంపల్లిలో 5.9 సెం.మీ., మైలర్దేవిపల్లిలో 5.6 సెం.మీ., అత్తాపూర్‌లో 5.0 సెం.మీ., గోల్కొండలో 4.8 సెం.మీ., బంజారా హిల్స్‌లో 4.1 సెం.మీ.గా నమోదయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లా బెల్గటూరులో 7.3 సెం.మీ., రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 7.3 సెం.మీ., కుమరంభీం జిల్లా ధనోరాలో 6.5 సెం.మీ. వర్షపాతం నమోదయింది. మెదక్ జిల్లా చిప్పలతూర్తి, కామారెడ్డి జిల్లా పాతరాజంపేట, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా భీమగల్‌లో 4 సెం.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసింది.
ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు డైవర్ట్ చేశారు. దీంతో ఆయన బెంగళూరులో బస చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com