హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్, లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్‌లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయ్యింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఐటీ కారిడార్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, కుకట్‌పల్లి, బాచుపల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం భారీగా పడింది. బన్సీలాల్పేట, సీతాఫల్ మండి, బేగంపేట, బోయినపల్లి, మారేడుపల్లి, రామగోపాల్ పేటలో ఉరుములు మెరుపులతో వర్షం కొనసాగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం, బోడుప్పల్, దిల్సుఖ్‌నగర్, కుత్బుల్లాపూర్, చందానగర్, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, మల్లంపేట్, సూరారం, జీడిమెట్ల, చింతల్ షాపూర్ వంటి ప్రాంతాల్లోనూ రోడ్లపై నీరు నిలిచింది.
జిహెచ్ఎంసి సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జిహెచ్ఎంసి కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, సిటీ పోలీస్ కమిషనర్‌లతో ఫోన్‌లో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు.
మరోవైపు ములుగు జిల్లా మంగంపేట మండలం సంరంనూరిలో గాలివాన బీభత్సం సృష్టించింది. సుడిగాలి వంటి ఈదురుగాలులకు భారీ చెట్లు కూలిపోయాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ముసురు వర్షాలతో పత్తి, సోయాబీన్ వంటి పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం రాష్ట్రానికి మరో రెండు రోజులపాటు రైన్ అలర్ట్ జారీ చేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com