ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌లో భారీ వర్షాలు; వాగులు పొంగి రాకపోకలు స్తంభించాయి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, తలమడుగు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉట్నూర్, నార్నూర్, జైనూర్ వంటి ఏజెన్సీ మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. నర్సాపూర్, శాంతాపూర్ వాగులు పొంగడంతో ఆ ప్రాంతాలకు వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. జిల్లా కలెక్టర్ రాజేష్ శీషా ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరూ బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు విస్తారంగా వర్షం కురుస్తోంది. ధర్పల్లి మండలంలోని ముత్యాలమ్మ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఇందల్వాయి గ్రామంలో పెంకుటిళ్లు కూలిపోయాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. సాలూర మండలం ఖాజాపూర్‌లో కూడా ఒక పెంకుటిల్లు కూలింది, పక్కనే ఉన్న రేకుల షెడ్డు ధ్వంసమైంది. మరోవైపు చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలూరు మండల కేంద్రంలో చెరువు మత్తడి పారుతోంది.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. గత 24 గంటల్లోనే నీటిమట్టం 10 అడుగులు పెరిగింది. ప్రాజెక్టు సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10 అడుగుల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. పోచారం మాయకట్టు రైతులు ఈ పరిణామంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com