కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు; లోతట్టు ప్రాంతాలు జలమయం
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గడచిన 24 గంటల్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కురుస్తున్నాయి.
ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని లో లెవెల్ వంతెనలు నీట మునిగాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి, రేకుల షెడ్లు కూలిపోయాయి.
కోటపల్లి మండలం అల్గాం గ్రామంలో రేకుల షెడ్డు కూలి ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మందమరి మండలం వెంకటేశ్వర దేవాలయం సమీపంలో ఓ ఇల్లు కూలి ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.
కడం ప్రాజెక్టుకు 20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. స్వర్ణ ప్రాజెక్టుకు 1045 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. వట్టివాగు ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో రావడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై దొంగపల్లి వద్ద భారీ వృక్షాలు నేలకూలడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కడం మండలం దర్బాజిపేట పరిధిలోని కర్రగూడ-పాద రివజిపోట మధ్య అప్రోచ్ రోడ్డు కొట్టుకపోయింది.
కుంటాల, పొచ్చర, బాహుబలి జలపాతాలు భారీగా ప్రవహిస్తుండడంతో నూతన అందాలను సంతరించుకున్నాయి. ఎగువ మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. గుండి వాగు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వాగుల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల ప్రభావం కొనసాగుతోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com