తిరుపతిలో భారీ వర్షాలు: ఐదుగురు మృతి, విద్యుత్ అంతరాయం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైన వర్షభీభత్సం ఇంకా కొనసాగుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన నగరాన్ని అతలాకుతలం చేసింది. అకస్మాత్తుగా మారిన వాతావరణంతో తిరుపతి నగరవాసులు మరియు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌తో పాటు విద్యుత్ సరఫరా కూడా తీవ్రంగా అంతరాయానికి గురైంది. తిరుపతితో పాటు AP లోని అనేక జిల్లాలలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి.
ఈ అకాల వర్షాలు భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని కూడా కలిగించాయి. గంటకు 40 నుంచి 50 km వేగంతో వీచిన ఈదురుగాలులు కృష్ణా, NTR, తూర్పు గోదావరి వంటి కోస్తాంధ్ర జిల్లాలపై తుఫాన్ లాగా తీవ్ర ప్రభావం చూపించాయి.
వర్షభీభత్సానికి ఐదుగురు మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లా కుమరపాలెంలో బైక్‌పై వెళ్తున్న మనోహర్, శివరామకృష్ణ అనే ఇద్దరు యువకులపై భారీ చెట్టు కూలిపడటంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలో ఈదురుగాలులకు విద్యుత్ లైన్ తెగిపడి హోమ్ గార్డు మరణించాడు. కృష్ణా జిల్లా లంకపల్లిలో తాగునీరు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళిన అనిత అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని గాలికి తెగిపడిన విద్యుత్ తీగను తొక్కడంతో విద్యుత్ షాక్‌కు గురై మరణించింది.
తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా వందలాది చెట్లు వేళ్ళతో సహా పెకిలించుకుపోయాయి. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. దీనివల్ల కృష్ణా, NTR జిల్లాలలోని చాలా ప్రాంతాలు గంటల తరబడి చీకట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. విజయవాడ పరిసర నగరాలలో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రస్తుతం విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.
రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కూడా గాలివాన కారణంగా అనేక పంటలు నేలకొరిగాయి. బొప్పాయి, మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రైతులకు దాదాపు 5 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ రాష్ట్రానికి వర్షం ముప్పు ఇంకా తొలగిపోలేదని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, తిరుపతి జిల్లాలలో మరికొన్ని గంటలలో 40 నుంచి 50 km వేగంతో గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com