ఉత్తర భారతంలో భారీ వర్షాలు: ముంబైకి రెడ్ అలర్ట్, అరుణాచల్‌లో ముగ్గురు గల్లంతు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, ఠాణే, పూణే ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఠాణే-పూణే మధ్య మాల్షేజ్ ఘాట్ రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ముంబైలోని అంధేరి ప్రాంతంలో సబ్వే పూర్తిగా నీట మునిగింది. దీంతో బృహత్ ముంబై కార్పొరేషన్ అండర్పాస్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేసింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. ప్రయాణికులు ఫ్లైట్ టైమింగ్‌ను సంబంధిత వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవాలని ఎయిర్పోర్ట్ అధికారులు సూచించారు.
ముంబై మేయర్ రీతు తావిడే వరద ప్రభావిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. దాదార్ హిందూ మాతా గాంధీ మార్కెట్ ప్రాంతంలో ఒక పారిశుధ్య కార్మికుడు తెరిచి ఉన్న డ్రైనేజీలో పడిపోవడంతో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ముంబైలో గత 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ ముంబై సివారు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలోని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కురుంగ్ కుమే జిల్లా సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చాయి. ముగ్గురు గల్లంతు కాగా, 20కి పైగా ఇండ్లు కొట్టుకుపోయాయి. యాజాలి సర్కిల్ ప్రాంతంలోని NEEPCO ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రభుత్వం యాజాలి పరిధిలో సిబ్బంది, వాహనాలను అత్యవసర సేవల కోసం సిద్ధం చేసింది.
నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించిన నేపథ్యంలో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com