ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, ఎల్లంపల్లికి వరద ప్రవాహం పెరిగింది
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు వరద నీటి ప్రవాహం పెరిగింది. జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 19.6 సెం.మీ., జగిత్యాల జిల్లా సారంగపూర్‌లో 19.5 సెం.మీ., బుగ్గారంలో 18.2 సెం.మీ., ఎండపల్లిలో 17.5 సెం.మీ., వెలగటూర్‌లో 16.6 సెం.మీ., రాయికల్‌లో 16 సెం.మీ., ధర్మపూర్‌లో 14.8 సెం.మీ., నిర్మల్ జిల్లా కడెం పెద్దూర్‌లో 14.5 సెం.మీ., పెద్దపల్లి కమాన్‌పూర్‌లో 14.1 సెం.మీ.గా నమోదైంది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ములుగు జిల్లా వాజేడులో 13.5 సెం.మీ., ఏటూరు నగరంలో 12.2 సెం.మీ., వెంకటాపురంలో 11.6 సెం.మీ., పెద్దపల్లిలో 9.9 సెం.మీ., మంచిర్యాల జైపూర్‌లో 9.7 సెం.మీ., కరీంనగర్ రామడుగులో 8.5 సెం.మీ. వర్షం కురిసింది.
ఈ వర్షాలతో ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం ఉదయం 10 వేల క్యూసెక్కుల నుంచి 60 వేల క్యూసెక్కులకు చేరుకుంది. రాత్రికి లక్ష క్యూసెక్కులు దాటే అవకాశం ఉంది. ఈ వరద నీటితో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు రోజుకు 329 క్యూసెక్కులు, ఎన్టీపీసీ రామగుండంకు 100 క్యూసెక్కులు ఇవ్వడంతోపాటు అక్టోబర్ వరకు నీటి లభ్యతకు ఢోకా ఉండదని అధికారులు తెలిపారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి నందిమేడారం పంప్ హౌసుకు నీటిని లిఫ్ట్ చేసి మిడ్మానేర్ రిజర్వాయర్ నింపే ప్రయత్నం చేస్తారు.
రాబోయే 24 గంటల్లో ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాలకు వాయుగుండం కారణమని తెలుస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com