హైదరాబాద్‌లో డ్రగ్స్ వినియోగం తగ్గినా రిసార్ట్‌ల్లో పెరిగింది: ఈగిల్ ఫోర్స్ ఎస్పీ
హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం, సరఫరా తగ్గాయని ఈగిల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. అయితే రిసార్ట్లు, ఫార్మ్ హౌస్లలో డ్రగ్స్ వినియోగం పెరిగిందని, ఆ ప్రాంతాలపై నిఘా ముమ్మరం చేశామని చెప్పారు.
అంతర్జాతీయ సింథెటిక్ డ్రగ్స్ రాకెట్‌ను ఢిల్లీ పోలీసుల సహకారంతో ఛేదించామన్నారు. ఈ కేసులో 52 మంది నైజీరియన్లను అరెస్ట్ చేసి వారి దేశానికి పంపించినట్లు వివరించారు. బ్యాంకాక్ నుంచి ముంబైకి డ్రగ్స్ తరలిస్తున్న మరో సిండికేట్‌ను కూడా పట్టుకుని భారీగా ఓజి గాంజా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఒడిస్సా, రాజస్థాన్ నుంచి రాష్ట్ర సరిహద్దులకు గంజాయి రవాణా జరుగుతోందని, రైల్వేలో ప్రత్యేక నిఘా పెంచామన్నారు. నాగవలి, భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో ఆర్పీఎఫ్ సమన్వయంతో వారానికి ఒకటి రెండు కేసులు నమోదు చేస్తున్నామని, 20 నుంచి 200 కిలోల వరకు గంజాయి పట్టుకుంటున్నామని వివరించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 7000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
కాలేజీ ఆవరణలో విద్యార్థులు గంజాయితో పట్టుబడితే, యాజమాన్యాలపై చర్యలు తీసుకునే అంశం ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎస్పీ గిరిధర్ తెలిపారు. హైదరాబాద్‌లోని కొన్ని కళాశాలలు విద్యార్థుల నిఘాపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయని, మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు.
డ్రగ్స్ వినియోగం వల్ల ఆకలి తగ్గడం, రోజువారీ కార్యకలాపాలు చేయలేకపోవడం, క్రమంగా కృశించి మరణించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణను డ్రగ్‌ఫ్రీ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని, ఈగిల్ ఫోర్స్ ప్రతి వ్యక్తిని దేశానికి ఉపయోగపడే వనరుగా భావించి కృషి చేస్తోందన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com