హైదరాబాద్‌లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ లో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు తెలవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. వండి తెచ్చిన నైవేద్యాన్ని సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.
లాల్ దర్వాజా ఆలయం విద్యుత్ దీపాలంకరణలు, పూలమాలలతో పండుగ శోభ కల్పిస్తోంది. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి సమర్పించే బంగారు బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.
రేపు రంగం కార్యక్రమంతో పాటు సామూహిక ఘటాల ఊరేగింపు జరగనుంది. దీంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఆలయానికి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయం కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, మహా మంగళ హారతి నిర్వహిస్తారు.
బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను కెమెరాలద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పరివేక్షిస్తున్నారు. ఈ రోజు, రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నారు. పాతబస్తీలో మదీనా ఎక్స్ రోడ్స్ నుంచి ఇంచన్ బౌలి వరకు ప్రధాన రహదారి మూసివేశారు. రేపు ఉదయం వరకు మహంకాళి ఆలయం వద్ద, అంబర్‌పేటలో మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com