ఏపీ, తెలంగాణలో నేడు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం; IMD అలర్ట్
వాతావరణ శాఖ నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రైన్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కేరళ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ రెండు రోజులు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.
దీని ప్రభావంతో ఏపీలో ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పాల్నాడు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతితో సహా పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు ఉంటాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని సూచించారు.
తెలంగాణలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. దీంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ సహా 16 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. వర్షాలు పడుతున్నా ఎండ తీవ్రత తగ్గలేదు; జూన్ 6 తర్వాతే వాతావరణం చల్లబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు, ఇటీవలి అకాల భారీ వర్షాల వల్ల ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. చేతికి అందిన పంట వరద నీటిలో మునిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టపోయారు. నష్ట పరిహారం కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com