కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు: విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
కాకినాడ జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు.
జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లు నీట మునిగడంతో రవాణా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యూ. కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లో మత్స్యకారుల ఇళ్లలోకి కూడా నీరు చేరింది. వర్షం ఎన్నికల విధులకు ఆటంకంగా మారిందని అధికారులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా వేయాలని స్థానికులు కోరుతున్నారు.
స్థానిక నివాసుల కథనం ప్రకారం, నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకూ ఇళ్లలోకి నీరు చేరింది. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమైందని వారు చెప్తున్నారు. మూడు రోజుల పాటు కరెంటు లేదని, తాగునీరు, పాలు ప్యాకెట్లు అందలేదని వారు ఆరోపిస్తున్నారు.
వర్షపు నీటితో ఇళ్లలోని వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్లు, టీవీలు పాడయ్యాయని నివాసులు తెలిపారు. తమను చూడటానికి ఎమ్మెల్యే గానీ, మున్సిపల్ అధికారులు గానీ రాలేదని వారి ఆరోపణ. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే లేదా మున్సిపల్ అధికారుల స్పందన లభ్యం కాలేదు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com