కాకినాడ చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు: 22 రోజులు గడిచినా ఆచూకి లేదు
కాకినాడ జిల్లాలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకి 22 రోజులు గడిచినా లభించలేదు. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన పాప జాడ తెలుసుకోవడానికి NDRF, SDRF, అటవీ శాఖ బృందాలు డ్రోన్లు, స్నిపర్ డాగ్ సాయంతో కాలువలు, అటవీ ప్రాంతాలు, కొండ పరిసరాలను విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాదాపు 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్లకొండలో 10 కిలోమీటర్ల మేర గాలించినా ఫలితం శూన్యమైంది. దీంతో అధికారులు తాత్కాలికంగా గాలింపు చర్యలను నిలిపి వేశారు.
చిన్నారితో పాటు వెళ్ళిన కుక్కకు GPS వ్యవస్థ అమర్చి వెతికారు. అయితే ఆ కుక్క మరుసటి రోజు చనిపోయింది. పోస్ట్‌మార్టం నివేదికలో కుక్క డీహైడ్రేషన్‌కు గురై ఆహారం, నీరు లేక మరణించిందని తేలింది. CCTV ఫుటేజ్లు, మొబైల్ టవర్ డంప్ కాల్ డేటా వంటి సాంకేతిక ఆధారాలు సేకరించినా ఫలితం లేకపోయింది.
ప్రస్తుతం పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారి అదృశ్యమైన రోజు గ్రామం నుంచి బయటికి వెళ్ళిన వారి ఫోన్ నంబర్ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. తుని పట్టణం, నర్సీపట్నం వెళ్ళే మార్గంలో రైల్వే స్టేషన్, బస్ స్టాప్‌లలో CC కెమెరా ఫుటేజ్లు పరిశీలించినా ఎలాంటి క్లూ లభించలేదు.
చిన్నారి జాడ తెలియకపోవడంతో తల్లి భవాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల పాటు తుని ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో లేవలేని స్థితిలో ఉన్నారు. ఆరు నెలల చెల్లెలు కూడా అక్క మీద బెంగతో కనిపిస్తోందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
రాష్ట్ర హైకోర్టు ఈ కేసుపై ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, DGP, కాకినాడ జిల్లా కలెక్టర్, SP లకు నోటీసులు జారీ చేసింది. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ప్రతిరోజు SP తో మాట్లాడుతున్నారని చెప్పారు. చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా సందర్శించి వెళ్ళింది. D. పోలవరంకు చెందిన శ్రీనివాసరావు అనే జ్యోతిష్యుడు చిన్నారి జూలై 28 లేదా సెప్టెంబర్‌లో తిరిగి వస్తుందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆ ఆశతో జీవిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com