కీసర: ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంట్లతో రూ.4.11 కోట్ల రుణాలు, ప్రధాన నిందితుడు బుర్ర మహేష్ అరెస్ట్
మేడ్చల్ జిల్లా కీసర పోలీసులు నకలీ ఆస్తి పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి రూ.4.11 కోట్ల రుణాలు పొందిన ప్రధాన నిందితుడు బుర్ర మహేష్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో మరి కొందరు నిందితులను కూడా అదుపులోకి తీసుకుని, వారి నుంచి నకిలీ స్థిరాస్తి పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలు, మొబైల్ ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
బుర్ర మహేష్, వేణుగోపాల్, వల్లభనేని శ్రీనివాసరావు అనే ముగ్గురు వ్యక్తులు 2018-19 ప్రాంతంలో చిన్న వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నిర్వహించేవారు. లోన్ ప్రాసెసింగ్‌లో అనుభవమున్న వేణుగోపాల్, బ్యాంకు అధికారులతో ఉన్న సత్సంబంధాల ద్వారా అర్హత లేని వారికి సైతం రుణాలు మంజూరు చేయించడం ప్రారంభించాడు. తర్వాత ఈ ముగ్గురు కలిసి తమ పేరు మీదే లేని ప్రాపర్టీలకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి, వాటిని రిజిస్ట్రేషన్ చేయించి, గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నిర్మాణ అనుమతి కూడా సృష్టించేవారు. ఈ విధానంలో ఇప్పటి వరకు దాదాపు 30 రుణాలు మంజూరు చేయించుకుని, మొత్తం సుమారు 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు లోన్లు పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ప్రస్తుతం బుర్ర మహేష్ కుటుంబ సభ్యులు, భార్య, సోదరి, బావమరిది వంటి వారి పేర్లపై 4.11 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఈ మొత్తం మోసానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది, బ్యాంకు ఏజెంట్లు కలిసి పనిచేసినట్లు ఆధారాలు లభించాయి. ఇప్పటివరకు దీనిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న 29 మంది నిందితులను గుర్తించామని, ఈ రోజు ఎనిమిది మందిని రిమాండ్‌కు పంపించామని పోలీసులు వెల్లడించారు. మిగిలిన నిందితుల కోసం నిఘా పెట్టామని తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com