ముంబైలో భారీ వర్షాలు: రోడ్లు, రైళ్లు, విమానాలు స్తంభించాయి
దక్షిణ పశ్చిమ ఋతుపవనాలు దేశం మొత్తం విస్తరించాయి. మహారాష్ట్రలో, ముఖ్యంగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 12 గంటల్లో నగరంలోని చాలా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోయి వాహనాలు నిలిచిపోయాయి.
నవీ ముంబై, అంధేరి, సోపారా ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా మునిగాయి. బాంద్రాలో వర్షానికి భారీ వృక్షం కూలి కార్లు సహా అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. పరేల్, విఠ్రోలి, ఘాట్కోపార్ ప్రాంతాల్లోనూ రోడ్లు జలమయమయ్యాయి. రైలు పట్టాలపై నీరు చేరడంతో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి కొన్ని విమానాలను అధికారులు దారి మళ్లించారు.
రాయగడ్ జిల్లాలో జోరు వర్షాలతో రవాణా స్తంభించింది. గోవా-ముంబై హైవేపై వరద నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొల్హాపూర్‌లోనూ వర్షాలు దంచికొడుతుండగా, పంచగంగా నది ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తోంది. పూణేలోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
ముంబై, పరిసర జిల్లాలకు వాతావరణ శాఖ మరో 24 గంటలు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో అధికారులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com