నిజామాబాద్: వివాహేతర సంబంధంపై అభ్యంతరం చెప్పిన భర్త, అత్తపై కూరలో గడ్డిమందు కలిపి హత్యాయత్నం
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మొదపల్లి గ్రామంలో ఒక మహిళ భర్త, అత్తకు కూరలో గడ్డిమందు కలిపి హత్యాయత్నం చేసింది.
వివాహేతర సంబంధం కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండగా, ఆగస్టు 1న సోని అనే మహిళ తాను వండిన కూరలో గడ్డిమందు కలిపిందని పోలీసులు తెలిపారు. సోని 10 ఏళ్ల క్రితం భూమయ్యను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు. సోనికి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త, అత్త భూదేవమ్మ గమనించి ఆమెను మందలించేవారు.
ఆ రోజు మధ్యాహ్నం అత్త భూదేవమ్మ ఆ కూర తినగా తీవ్ర వాంతులు, విరోచనాలు అయ్యాయి. భూమయ్య కూర తినడానికి ముందు దానిలో గడ్డిమందు వాసన రావడంతో కొంచెం తిని ఆపేశాడు. ఇరువురికీ అస్వస్థత కలిగింది. స్థానికులు వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది.
భూమయ్య ఫిర్యాదుతో మోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోనిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె నేరం ఒప్పుకుంది. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపినట్లు ఎస్హెచ్వో సుష్మిత తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com