పంజాగుట్ట: స్మశానంలో పాతిపెట్టిన శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో ఖననం చేసిన నవజాత శిశువు మృతదేహం మాయమైన సంఘటన చోటు చేసుకుంది.
కోల్కతాకు చెందిన రాజు మండల్, పూజ దంపతులు పాత బస్తీలోని గాంధీ బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం పూజ బంజారా హిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో కవల శిశువులకు జన్మనిచ్చారు. ఆరు నెలల్లోనే ప్రీమెచ్యూర్ డెలివరీ కావడంతో శిశువులను ఎన్ఐసియులో ఉంచి చికిత్స అందించారు. ఆదివారం తెల్లవారుజామున ఒక శిశువు మృతి చెందింది.
కుటుంబ సభ్యులు ఆ శిశువు మృతదేహాన్ని పంజాగుట్ట శ్మశానానికి తీసుకెళ్లి ఖననం చేశారు. సోమవారం తెల్లవారుజామున రెండో శిశువు కూడా మృతి చెందడంతో, మొదటి శిశువు సమాధి పక్కనే ఖననం చేసేందుకు వచ్చారు. అయితే అక్కడ మొదటి శిశువు సమాధి గుర్తు కనిపించలేదు. సమాధిని తవ్వి చూడగా శిశువు దేహం మాయమైనట్టు తేలింది.
కుటుంబ సభ్యులు శ్మశాన సిబ్బందిని ప్రశ్నించగా, తమకు ఏమీ తెలియదని సమాధానం ఇచ్చారు. తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజు మండల్ బంధువులు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కొంతమంది శ్మశాన సిబ్బందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
శిశువు దేహం ఎలా మాయమైంది, ఇందులో సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com