రాయదుర్గం భూమి వేలం వివాదం: హైకోర్టులో SBI పిటిషన్, తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) హైదరాబాద్ లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 5.09 ఎకరాల భూమిని వేలం వేసింది. గౌరా వెంచర్స్ అనే సంస్థ ఎకరాకు రూ.237 కోట్ల చొప్పున బిడ్ చేసి మొత్తం రూ.1,038 కోట్లకు ఆ భూమిని సొంతం చేసుకుంది.
అయితే ఈ వేలం ప్రక్రియపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.13.33 కోట్లకు ఆ భూమిని ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి కొనుగోలు చేసినట్లు, సేల్ అగ్రీమెంట్ కూడా జరిగిందని ఎస్బీఐ పేర్కొంది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు వేలంపై మూడు వారాల పాటు మధ్యంతర నిషేధం విధించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్దేశిత రెండు సంవత్సరాల వ్యవధిలో ఎస్బీఐ అక్కడ కార్యాలయం నిర్మించలేదని, అందువల్ల 2021లోనే భూమి కేటాయింపును రద్దు చేసి స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించినట్లు సమాచారం.
ఎస్బీఐపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని దాదాపు 1200 ఎస్బీఐ బ్రాంచ్లలోని ప్రభుత్వ డిపాజిట్లు, ఖాతాలను ఖాళీ చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 80% మంది జీతాల ఖాతాలు, సంక్షేమ నిధుల లావాదేవీలు ఎస్బీఐ ద్వారానే జరుగుతుండటంతో, ఈ చర్య బ్యాంకుకు భారీ దెబ్బగా మారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ఎస్బీఐపై తీసుకోదగిన చర్యలపై చర్చించారు. ఎస్బీఐ తీరుపై ఆర్బీఐకి, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com