రాజకీయాల్లో 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత రెడ్డి రాజకీయాల్లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రారంభమైన తన ప్రయాణం నేడు ముఖ్యమంత్రి పదవి వరకు చేరుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ 20 ఏళ్లలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న అప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశారు. అనంతరం ప్రజాసేవ వైపు మొగ్గు చూపారు.
2006లో స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా స్వతంత్రంగా విజయం సాధించారు. 2009లో టీడీపీ తరఫున కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అదే స్థానం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి, 2014-17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు.
2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి చవిచూశారు. కానీ 2019లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2021 జూన్ 26న కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు నిరసనలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కామారెడ్డిలో ఓడిపోయి, కొడంగల్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించడంతో రేవంత్ రెడ్డి సీఎల్పీ నేతగా ఎన్నికై, 2023 డిసెంబర్ 7న తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com