బీఆర్ఎస్ నేత రూపారెడ్డిపై మరో కేసు నమోదు, అరెస్టు
మణికొండ బీఆర్ఎస్ నేత రూపారెడ్డిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాయిదుర్గం పోలీస్ స్టేషన్‌లో మరో ఎఫ్ఐఆర్ దాఖలైంది.
డి. సీతాదేవి, పద్మ అనే ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూపారెడ్డి తమ నుంచి 26 లక్షలు అప్పుగా తీసుకొని మోసం చేసినట్టు వారు ఆరోపించారు. అధిక వడ్డీ ఇస్తామని నమ్మించి, సీతాదేవి నుంచి 12 లక్షలు, పద్మ నుంచి 3 లక్షలు తీసుకున్నారని తెలిపారు. వీరిలో 5 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించగా, మిగిలిన సొమ్ము ఇవ్వలేదని ఆరోపించారు. డబ్బు అడిగినప్పుడు రూపారెడ్డి భర్త బెదిరింపులకు దిగుతున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరో ఉపాధ్యాయిని జి. రమాదేవి వద్ద 16 లక్షలు తీసుకున్నారన్న ఆరోపణపై కూడా రాయిదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు.
నిన్న రూపారెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. చిట్టీల పేరుతో మోసం చేశారన్న ఫిర్యాదుల మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో సహా మూడు కేసులు నమోదయ్యాయి. ఫిల్మ్ నగర్‌లో ఒక చీటింగ్ కేసు, రాయిదుర్గంలో రెండు కేసులు కలిపి రూపారెడ్డిపై మొత్తం ఏడు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రూపారెడ్డి చంచలగూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com