హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం: ట్రైనీ IPS పై కేసు నమోదు
హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ IPS అభ్యర్థి ఉదయ కృష్ణా రెడ్డి, మరో మహిళా ట్రైనీని లైంగికంగా వేధించాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
కర్ణాటకకు చెందిన ఆ మహిళ సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ కృష్ణా రెడ్డి కూడా అదే అకాడమీలో ట్రైనీ IPS గా శిక్షణలో ఉన్నారు. జూన్ 23 నుంచి అతను WhatsApp నంబర్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడని ఆ మహిళ ఫిర్యాదు చేశారు.
బాధితురాలి గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యక్తిగత దూషణలు చేయడంతోపాటు, అక్రమ సంబంధం ఉందని దుష్ప్రచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని వ్యక్తిగత సమాచారం సేకరించాడని, గదిలోకి లాకెళ్ళి భయభ్రాంతులకు గురిచేసి ఫోన్ పాస్‌వర్డ్ తెలుసుకున్నాడని పేర్కొన్నారు. మెడపై కత్తి పెట్టి బెదిరించాడని, అసభ్యకరంగా ప్రవర్తించి వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించాడని కూడా బాధితురాలు వెల్లడించారు. ఆ వీడియోలను ఆమె భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉదయ కృష్ణా రెడ్డి శిక్షణ సమయంలో సహచరులతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, WhatsApp గ్రూపులు ఏర్పాటు చేసి తప్పుడు సందేశాలతో పలువురిని మనోవేదనకు గురిచేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ కృష్ణా రెడ్డి 2013లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. సివిల్స్ పరీక్షలో నాలుగుసార్లు విఫలమై ఐదవసారి 360వ ర్యాంకు సాధించారు. ఇప్పుడు అదే శిక్షణా సమయంలో సహచరి మహిళా ట్రైనీని వేధించాడని కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com