మణగూరులో సింగరేణికి పికేఓసి-2 డిప్‌సైడ్ బొగ్గు బ్లాక్ కేటాయింపు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సింగరేణి కాలరీస్ సంస్థకు మణగూరు సమీపంలోని పికేఓసి-2 డిప్‌సైడ్ బొగ్గు బ్లాక్ వేలం పద్ధతిలో కేటాయించబడింది. ఈ బ్లాక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగూరు ప్రాంతంలో ఉంది.
ఈ బ్లాక్ నుంచి సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులోకి రానున్నాయి. ఏడాదికి 6 మిలియన్ టన్నుల చొప్పున 25 సంవత్సరాల పాటు గనులు నడుస్తాయని, దీని ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అలాగే సింగరేణికి రూ.43,000 కోట్లకు పైగా రెవెన్యూ, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు మించి ఆదాయం సమకూరుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.
ఇటీవలే సింగరేణికి ఒడిషా లోని నైనీ బొగ్గు బ్లాక్, తాడిచర్ల-2 బ్లాక్ కూడా కేటాయించబడ్డాయి. ఈ మూడు బ్లాకులతో సంస్థకు మొత్తం 860 మిలియన్ టన్నుల నిల్వలు దక్కుతాయి. సగటున 35 ఏళ్ల పాటు 22 మిలియన్ టన్నుల ఏటా ఉత్పత్తి సామర్థ్యం, 6,500 మందికి ఉద్యోగ కల్పన, రాష్ట్రానికి దాదాపు రూ.48,000 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అంచనా.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు, తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. దక్షిణ భారతదేశానికి అవసరమైన బొగ్గు సరఫరా, తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి ఈ చర్య తోడ్పడుతుందని వివరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com