జూబ్లీహిల్స్‌లో SIR ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో SIR ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. BLO లకు ఎన్యుమరేషన్ పత్రాలు అందకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పత్రాలు సకాలంలో అందించడంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఇతర సామాగ్రిని పంపిణీ చేసిన అధికారులు ఎన్యుమరేషన్ పత్రాలు మాత్రం అందించలేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ ఇంకా మొదలు కాలేదు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే ERO కార్యాలయం వద్ద ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చే ఓటర్లకు SIR పైన అనుమానాలు తీర్చడం, ఆ ప్రాంతంలోని BLO ల వివరాలు అందించడం జరుగుతోంది. అయితే BLO లకు ఇవ్వాల్సిన ఫారాలు మాత్రం ఇంకా చేరలేదు.
GHMC డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు తప్ప మిగతా మెటీరియల్ అంతా పంపిణీ చేశారు. బోరబండ, యూసుఫ్‌గూడ అనే రెండు సర్కిల్స్‌లో కలిపి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గంలో దాదాపు 400కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటన్నింటికీ BLO లకు పత్రాలు అందించాల్సిన అవసరం ఉన్నా ఆ పరిస్థితి ఇంకా ఏర్పడలేదు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువమంది ఓటర్లు తరచుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారిపోతుంటారు కాబట్టి మ్యాపింగ్ కూడా చాలా కష్టంగా మారింది. కొన్ని సర్కిల్స్‌లో మ్యాపింగ్ 40 నుంచి 46% వరకు మాత్రమే జరిగింది. సాయంత్రం అయిదు గంటలు అవుతున్నా ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోవడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈరోజు పూర్తిగా ఎలాంటి పని జరగలేదు. ముషీరాబాద్ నియోజకవర్గంలో కూడా మధ్యాహ్నం వరకు ఫారాలు అందలేదు. ఎక్కడ ఫారాలు అందాయో అక్కడ మాత్రం BLO లు ఓటర్లకు పత్రాలు అందిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com