స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం; సంగారెడ్డిలో సీఎం ప్రారంభోత్సవం
తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కార్డుల పంపిణీ మొదలవుతుందని చెప్పారు.
సంగారెడ్డిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను అధికారికంగా ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 3.43 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందిస్తామని మంత్రి వివరించారు.
ఇప్పటికే 16 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసినట్లు ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, లబ్ధిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
రేషన్ బియ్యం కోసం ఏటా 14 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయని మంత్రి తెలిపారు. స్మార్ట్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి సమీక్ష నిర్వహించారు.
సంగారెడ్డిలో జరిగే ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com