వచ్చే వారం నైరుతి రుతుపవనాలు బలపడే అవకాశం - IMD హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల తర్వాత నైరుతి రుతుపవనాలు బలపడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రుతుపవనాలు బలహీనంగా ఉన్నప్పటికీ వచ్చే వారం చివరి నాటికి మాన్సూన్ మరింత విస్తరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని IMD పేర్కొంది.
హిందూ మహాసముద్రం నుంచి అరేబియా సముద్రం వైపు వీచే తేమ గాలులు వచ్చే వారం బలపడతాయని వెదర్ ఆఫీసర్లు చెప్పారు. క్రాస్ ఈక్వేటోరియల్ ఫ్లో కూడా 24వ తేదీ నాటికి బలం పుంజుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణతో పాటు కోర్ మాన్సూన్ జోన్ లోని రాష్ట్రాలపై వెస్టర్లీస్ ప్రభావం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
మాన్సూన్ బలపడిన తర్వాత జూలై చివరి నాటికి లేదా సెప్టెంబర్ తొలివారంలో ఎల్నీనో మరింత బలపడుతుందని IMD అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పసిఫిక్ లో దాని తీవ్రత ఎక్కువైందని తెలిపారు.
జూన్ మూడో వారంలోకి వచ్చినా రాష్ట్రంలో ఎండలు మాత్రం తగ్గడం లేదు. పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రెండు రోజులుగా 150కి పైగా మండలాల్లో వడగాల్పులు రికార్డు అవుతున్నాయి. 23 జిల్లాల్లో వడగాల్పుల పరిస్థితి నెలకొంది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో హీట్ వేవ్స్ కొనసాగుతాయని IMD హెచ్చరించింది.
సాయంత్రం సమయంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంతో పాటు నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షం కురిసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com