ఆదిలాబాద్‌లో వర్షాలతో సోయా పంటకు సమస్యలు – శాస్త్రవేత్త సూచనలు
ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో సోయా పంటలో పలు సమస్యలు తలెత్తాయి. అక్కడక్కడ వేరుకుళ్ళు, కాండపు కుళ్ళు కనిపిస్తున్నాయని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్ తెలిపారు. వాటి నివారణకు కార్బండజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ 2 గ్రాములను లీటర్ నీటిలో కలిపి మొక్క మొదట్లో పిచికారి చేయాలని సూచించారు.
ఇక పోషక లోపాల వల్ల చిగురాకులు పసుపు రంగులోకి మారి మాడిపోతున్నాయి. ఈ సమస్యకు 3 గ్రాములు లేదా 13:0:45 ఎరువు 10 గ్రాములు, ఫార్ములా-4 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. సల్ఫర్, ఐరన్ లోపాలు కూడా కనిపిస్తే వెటబుల్ సల్ఫర్ 3 గ్రాములు లీటర్ నీటికి వాడాలి.
పురుగుల విషయంలో కాండపు ఈగ, కాండపు తొలిచే పురుగు (పెంకు పురుగు) ఆశించాయి. వీటి నివారణకు ఎకరానికి కార్బోఫిరాన్ 3జీ గుళికలు 8-10 కిలోలు ఇసుకతో కలిపి చల్లాలి. కాండపు ఈగకు ఎసిఫేట్ 1-2 గ్రాములు, లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు, లేదా థయోమిథాక్సామ్+లాంబ్డా సైలోత్రీన్ 0.4 మి.లీ. లీటర్ నీటికి పిచికారి చేయాలి. కాండపు తొలిచే పురుగు నివారణకు క్లోరాంతనిప్రోల్ 0.3 మి.లీ., టెట్రానిలిప్రోల్ 0.5 మి.లీ. వంటి మందులను కూడా ఉపయోగించవచ్చు.
ఇక ఆంత్రనోజ్ ఆకుమచ్చ తెగులు కనిపిస్తే ప్రాపికోనజోల్ 1 మి.లీ. లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. డీఏపీ, పొటాష్, యూరియా వంటి బేసల్ ఎరువులు వేయని పక్షంలో ఇప్పుడు ఎకరానికి 25-30 కిలోల యూరియా టాప్ డ్రెస్సింగ్ గా వేసుకోవాలి.
ఈ జాగ్రత్తలు పాటిస్తే సోయా పంట ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి వస్తుందని శాస్త్రవేత్త రాజశేఖర్ తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com