SRSP కి భారీ వరద: 3 రోజుల్లో 16 నుంచి 29 టీఎంసీలకు చేరిన నీటిమట్టం
శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ (SRSP) లో గత మూడు రోజుల్లో భారీగా వరదనీరు చేరింది. జూలై 29న 16 టీఎంసీల నీటి నిలవ ఉండగా, ప్రస్తుతం అది 29 టీఎంసీలకు పెరిగింది. మహారాష్ట్రలోని గైక్వాడ్, విష్ణుపురి, బాలేగాం, బాబ్లీ ప్రాజెక్టుల నుంచి భారీ వరదనీరు రావడంతో ఇన్ఫ్లో 85,266 క్యూసెక్కులకు చేరింది.
IRRIGATION శాఖ ఇంజనీర్ల ప్రకారం, మరో రెండు రోజుల్లో నీటిమట్టం 42 టీఎంసీలకు చేరే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 38 టీఎంసీల నీరు నిలవ ఉంది.
ఈ వరద ప్రభావంతో ప్రాణహిత, వార్ధా నదుల పరీవాహక ప్రాంతాల్లో పంట పొలాలు మునిగాయి. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, కౌటాల, బెజ్జూరు తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వెంకట్రావుపేట హై లెవెల్ బ్రిడ్జి, పుట్కలి లో లెవెల్ వంతెనపై నీరు చేరడంతో రెండు ప్రధాన మార్గాలు మూతపడ్డాయి. దీనివల్ల 100కు పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వంతెనల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు.
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి SRSP ప్రాజెక్టును సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఉత్తర తెలంగాణలో SRSP ప్రాజెక్టు దాదాపు 70% సాగునీటి అవసరాలు తీరుస్తుంది. నీటి వినియోగాన్ని గరిష్టంగా సాగుకు ఉపయోగించేలా ప్రణాళిక చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com