తెలంగాణ రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం వానాకాలం సూచనలు
జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విడుదల చేసింది. రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 27 నుండి 34 డిగ్రీల సెల్సియస్, రాత్రి 23 నుండి 27 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా.
ఈ నేపథ్యంలో వర్షాధార పంటలు విత్తడానికి నేల 15-20 సెంటీమీటర్ల లోతు తడిసిన తర్వాతే వాలుకు అడ్డంగా లేదా కాలువల పద్ధతిలో విత్తనాలు వేయాలని సూచించారు. చెరువులకు దూరంగా తక్కువ నీటి వసతి ఉన్న రైతులు ఆరుతడి పంటలను ఎంచుకోవాలి. ఇప్పటికే విత్తిన రైతులు పొలాల్లో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి.
పండిన కూరగాయ పంటలైన టమాటా, వంగ, బెండ, మిర్చి, ఆకుకూరలు కోత దశకు వచ్చిన వాటిని వెంటనే తీసేయాలన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు, పశువులను చెట్ల కింద ఉంచరాదని, విద్యుత్ స్తంభాలు, నీటి కుంటలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
వరి సాగు చేసే రైతులకు పచ్చిరొట్ట పైర్లు (జనుము, జీలుగ, పెసర, పిల్లిపెసర, అలసంద) విత్తడానికి ఇది సరైన సమయం. నీటి సౌకర్యం ఉన్న చోట్ల మధ్యకాలిక, స్వల్పకాలిక వరి నారుమడులు పోయించుకోవచ్చు. తెలంగాణ సోనా RNR 15048 రకం విత్తనాన్ని మాత్రం జూలై మొదటి వారంలోనే నారుమడి పెట్టాలని స్పష్టం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com