తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీకి ఆమోదం.. రూ.116 కోట్లు విడుదల
తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.116 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే 90 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లల కొనుగోలుకు టెండర్లు పిలవాలని ఆదేశాలిచ్చింది.
ఈ పథకం కింద రాష్ట్రంలో 12 లక్షల మత్స్యకార కుటుంబాల జీవనోపాధి కోసం 2016 నుంచి ప్రతి ఏటా అమలు చేస్తున్నారు. 77 భారీ రిజర్వాయర్లు, 4,647 మత్స్యశాఖ చెరువులు, 19,465 చిన్న నీటి వనరుల్లో చేపలు, రొయ్యల పెంపకం జరుగుతోంది.
ఈ ఏడాది జూన్-జూలై నెలలో టెండర్లు పిలవాల్సి ఉండగా, వర్షాలు సరిగా లేక చెరువుల్లో నీరు చేరకపోవడంతో పథకం అమలుపై సందిగ్ధత ఏర్పడింది. అయితే ఇటీవల 10 రోజుల పాటు కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు నిండాయి. దీంతో మత్స్యశాఖ కమిషనర్ నిఖిల పథకం అమలుకు రూ.134.94 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్రతిపాదనను సీఎం కార్యాలయం ఆమోదించడంతో ప్రభుత్వం రూ.116 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ.18.94 కోట్లు టెండర్ల అనంతరం విడుదల చేయనున్నారు.
టెండర్ల ప్రక్రియ ఈ నెల 5 లేదా 6వ తేదీన ప్రారంభించి, మూడో వారంలో పూర్తి చేస్తారు. సెప్టెంబర్ మొదటి వారంలో చేప, రొయ్య పిల్లలను చెరువుల్లో వదిలేందుకు మత్స్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com