తెలంగాణ

వానాకాలం సాగు: పంట కొనుగోలుపై తెలంగాణ రైతుల్లో అయోమయం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వానాకాలం సాగు: పంట కొనుగోలుపై తెలంగాణ రైతుల్లో అయోమయం
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణలో వానకాలం పంటల సాగు ప్రారంభం కాగా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల కొనుగోలు విధానంపై రైతులు అయోమయంలో ఉన్నారు.

కేంద్రం నిర్ణీత కోటా మేరకే పంటలు కొనుగోలు చేస్తుందని, దానికి మించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయబోదని ఇటీవలి ప్రకటనలు సంకేతాలిస్తున్నాయి. దీంతో ఏ పంట వేయాలో, ఎంత సాగు చేయాలో తెలియక రైతులు సందిగ్ధంలో పడ్డారు.

గత వానకాలం సీజన్లో 1.37 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 69.89 లక్షల ఎకరాలు, మక్క 6.9 లక్షలు, కందులు 4.31 లక్షలు, పత్తి 50.70 లక్షలు, వేరుశనగ 25 వేలు, జొన్న 24 వేల ఎకరాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా దాదాపు 1.38 కోట్ల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా. వరి 69 లక్షలు, పత్తి 53 లక్షలు, మక్క 7 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి.

పంటల కొనుగోలుపై స్పష్టత లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఖరీదు చేసే పంటలు, పరిమాణాలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉత్పత్తి అనంతరం వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com