ఫ్యామిలీ రిజిస్టర్ తయారీకి ప్రభుత్వం నిర్ణయం
రేషన్ కార్డు డేటా ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు అవసరమైనప్పుడు మీసేవ ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్టిఫికెట్ కేవలం కుటుంబ సభ్యుల వివరాల కోసమేనని, ఆస్తులపై హక్కుల నిర్ధారణకు ఉపయోగించరాదని అధికారులు స్పష్టం చేశారు.
ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కుటుంబ వివరాల ధృవీకరణకు సరైన రికార్డులు లేవు. దీంతో వారు చెప్పే సమాచారాన్నే నమ్మాల్సి వచ్చేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారికంగా ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు నెంబరే ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (FRIN) గా ఉంటుంది. రిజిస్టర్లో కుటుంబ పెద్ద పేరు, సభ్యులందరి పేర్లు, వయసు, బంధుత్వం, ఆధార్ నంబరు, చిరునామా వంటి వివరాలు ఉంటాయి.
మీసేవ కేంద్రాల్లో యాప్వాట్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన రెండు రోజుల్లో సంబంధిత మండల తహసీల్దార్ రేషన్ కార్డు డేటా ఆధారంగా డిజిటల్ సంతకంతో సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ కోసం ఎలక్ట్రానిక్ సేవల డెలివరీ (ESD) విభాగానికి అవసరమైన సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలని, పౌర సరఫరాల శాఖ డేటాను అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఎస్ఐఆర్ కోసం నిర్దేశించిన 12 ధ్రువపత్రాల్లో ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఒకటని ఆయన గుర్తు చేశారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకునే పేదలకు ఇది చాలా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com