తెలంగాణ

ఇసుక కొరత లేదు.. సాయంత్రం 5కు రాండమైజేషన్ బుకింగ్స్: టీజీఎండిసీ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఇసుక కొరత లేదు.. సాయంత్రం 5కు రాండమైజేషన్ బుకింగ్స్: టీజీఎండిసీ
📷 Sharath G. / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణలో ఇసుక ఆన్‌లైన్ బుకింగ్‌లో సాయంత్రం స్లాట్‌ను కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉదయం 9 గంటలకు మాత్రమే జరిగే రాండమైజేషన్ బుకింగ్స్ విధానాన్ని త్వరలోనే సాయంత్రం 5 గంటలకు కూడా విస్తరిస్తామని టీజీఎండిసీ ఎండీ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా వినియోగదారులకు ఇసుక సరఫరా సక్రమంగా జరుగుతోందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో ఇసుక లభ్యతకు ఎలాంటి కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ వద్ద 1 కోటి మెట్రిక్ టన్నులకు పైగా ఇసుక నిల్వలు ఉన్నాయన్నారు. రోజుకు సగటున 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను పోర్టల్‌లో విడుదల చేస్తుండగా, అందులో 63,000 టన్నుల ఇసుక బుక్ అవుతోంది. మిగిలిన 46,000 టన్నుల ఇసుక ప్రతిరోజు అన్బుక్డ్‌గా మిగిలిపోతోందని, అందువల్ల ‘అవుట్ ఆఫ్ స్టాక్’ అనే సమస్యే తలెత్తదని ఆయన వివరించారు.

ఆన్‌లైన్ బుకింగ్‌లో దలారులు, ఐటీ స్క్రిప్ట్‌లు, బాట్‌ల వినియోగం వంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకున్నామని ఎండీ తెలిపారు. పారదర్శకత కోసం లాగిన్ నుంచి స్టాక్ ఎంపిక వరకు ప్రతి దశలో 200 సెకండ్ల ఫోర్స్డ్ టైమర్ విధానాన్ని తీసుకువచ్చినట్లు, సైబర్ ట్రాఫిక్ సమస్యను నివారించడానికి బాట్ ఐపీలను బ్లాక్ చేసినట్లు ఆయన వివరించారు. వినియోగదారుల కోసం షామీర్పేట పరిధిలో మరో సాండ్ బజార్ కూడా అందుబాటులోకి రానుందని వెల్లడించారు.

జూన్ ఒకటి నుంచి 23 వరకు మొత్తం 25.36 లక్షల టన్నుల ఇసుకను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయగా, అందులో 14.63 లక్షల టన్నులు బుకింగ్ అయ్యాయని, మిగిలిన 10.73 లక్షల టన్నుల నిల్వలు యార్డ్‌లో అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. రాండమైజేషన్ ద్వారా మొత్తం 28,332 మంది వినియోగదారులకు ఇసుక కేటాయింపులు జరిగాయని, టాప్ 20 స్టాక్ యార్డుల ద్వారా 10 వేల వాహనాలు లబ్ధి పొందాయని వివరించారు. ఇందులో ఐదు కంటే తక్కువ ట్రిప్పులు పొందిన సాధారణ వినియోగదారులే అధికంగా ఉన్నట్లు తెలిపారు.

బల్క్ బుకింగ్ విభాగంలో నిబంధనలను సరళీకరించి, వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో 97% ఆమోదించామన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి 13,843 దరఖాస్తులకు 13,616 అప్లికేషన్లకు అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు.

అక్రమాలపై చర్యల్లో భాగంగా, ఒక రీచ్‌లో బుక్ చేసిన ఆర్డర్‌లను అనుమతి లేకుండా మరో రీచ్‌కు మార్చే 83 ఆర్డర్‌లపై చర్యలు తీసుకున్నామని, 2.83 లక్షల పెనాల్టీలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com