నీటి కొరత: ప్రాజెక్టుల కింద వరి సాగు వద్దని మంత్రుల ఆదేశం
తెలంగాణలో నీటి కొరత నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాజెక్టుల కింద రైతులు వరి సాగు చేయవద్దని సూచించారు.
జిల్లా నీటిపారుదల సలహా మండలాలను వెంటనే పునరుద్ధరించాలని మంత్రులు కలెక్టర్లను ఆదేశించారు. ఈ మండళ్లలో నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండాలని తెలిపారు. ప్రతి పంట కాలానికి ముందు ఈ మండలాలు సమావేశం కావాలని సూచించారు.
జలాశయాల నీటి నిల్వలు, స్థానిక వర్షపాతం, తాగునీటి అవసరాలు, కమాండ్ ఏరియాల్లో సాగు పరిస్థితులను సమీక్షించి రైతులకు శాస్త్రీయమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు. రైతులు ఏ పంట వేస్తే భవిష్యత్తులో నష్టపోకుండా ఉంటారో ముందుగానే తెలియజేయాలన్నారు. ఒత్తిళ్లకు లోనై విచక్షణారహితంగా నీటిని విడుదల చేయరాదని స్పష్టం చేశారు. ప్రధాన జలాశయాల ప్రస్తుత పరిస్థితిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్లకు మంత్రులు సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com