తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై 300% ఆస్తి పన్ను ప్రతిపాదన
తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొత్త ముసాయిదా బిల్లును రూపొందించింది. క్యూర్ 2026 ముసాయిదా బిల్లు ప్రకారం, అనుమతి లేకుండా నిర్మించిన భవనాలు, అనుమతి మించి అదనపు అంతస్తులు నిర్మించిన భవనాలపై 300 శాతం ఆస్తి పన్ను విధించాలని ప్రతిపాదించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న 100 శాతం జరిమానా స్థానంలో ఈ మూడు రెట్లు పెంపును ప్రతిపాదించారు. బిల్లు అమలుకు ముందు పన్ను మదింపు పూర్తైన అక్రమ నిర్మాణాలకు ప్రస్తుత 100% పెనాల్టీ యథాతదంగా కొనసాగుతుందని తెలిపారు.
సెట్ బ్యాక్ నిబంధనల ఉల్లంఘనపై కూడా కొత్త జరిమానాలు ప్రతిపాదించారు. 10 శాతం వరకు ఉల్లంఘిస్తే 25 శాతం, అంతకంటే ఎక్కువ ఉల్లంఘిస్తే 50 శాతం పెనాల్టీ విధించనున్నారు. నివాస అనుమతి తీసుకుని వాణిజ్య అవసరాలకు వినియోగించిన భవనాలపై 100 శాతం జరిమానా విధించాలని ప్రతిపాదించారు.
ప్రజారోగ్య రక్షణ కోసం స్థానిక సంస్థల కమిషనర్లకు విస్తృత అధికారాలు ఇవ్వాలని ముసాయిదా బిల్లు సూచిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ప్రదేశాలు లేదా రవాణా వాహనాల వల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నట్లు గుర్తిస్తే కమిషనర్లు తనికీలు నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవచ్చు. ప్రజారోగ్యానికి హాని కలిగించే భవనాలు లేదా ప్రాంగణాలను మూసివేసే అధికారం కూడా ప్రతిపాదించారు.
రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ బిల్లు ప్రతిపాదనలను స్వాగతిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ కొత్త నిబంధనలు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేస్తాయని, బాధ్యతాయుతమైన నిర్మాణాలను ప్రోత్సహిస్తాయని రియాల్టీ సంస్థలు భావిస్తున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com