నాగార్జునసాగర్లో రేపు వరుణయాగం నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపు నాగార్జునసాగర్ వద్ద వరుణయాగం నిర్వహించనుంది. ఈ యాగం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనుండగా, సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు.
రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రభుత్వం ఈ యాగాన్ని చేపట్టింది. నాగార్జునసాగర్ జామ తీరాన విజయవిహార్ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు యాగాన్ని నిర్వహిస్తారు. తెల్లవారుజాము 4:05 గంటలకు గోపూజతో యాగం ప్రారంభమై, మధ్యాహ్నం 3:24 గంటలకు పూర్ణాహుతితో ముగుస్తుంది. 11 కుండాలతో నిర్వహించే ఈ యాగంలో 108 మంది రుత్వికులు పాల్గొంటారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి, కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని, చెరువులు నిండి పంటలు బాగా పండాలని సంకల్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి రాకను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మొత్తం 600 మంది సిబ్బందితో వేదికను ఏడు సెక్టార్లుగా విభజించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోకి వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు వస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండితే రాష్ట్రంలో కరువు ముప్పు తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com