TG20 లీగ్ విజయవంతం: జస్టిస్ నవీన్ రావు నేతృత్వానికి ప్రశంసల జల్లు
తెలంగాణలో యువ క్రికెటర్లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మొదలైన TG20 లీగ్ తొలి సీజన్ విజయవంతంగా ముగిసింది. జూన్ 21న ప్రారంభమైన ఈ లీగ్ 20 రోజులకు పైగా కొనసాగింది. సోమవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టు ఖమ్మం ఏసెస్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి తొలి కప్‌ను కైవసం చేసుకుంది.
ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం ఏసెస్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులు సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఛాంపియన్స్ 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల విజేత జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతిని అందజేశారు. రన్నర్ అప్‌గా నిలిచిన ఖమ్మం జట్టుకు 50 లక్షల రూపాయలు, మూడు నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో 25 లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేసి గవర్నర్ క్రీడాకారులను అభినందించారు.
ఈ లీగ్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనగా 21 రోజుల పాటు 32 మ్యాచ్‌లు జరిగాయి. TG20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో విజయ్ దేవరకొండను ఎంపిక చేశారు. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పలువురు ప్రముఖులు, క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
సింగల్ మెంబర్ కమిటీ ద్వారా లీగ్‌లో పారదర్శకత, పాలనాపరమైన నియంత్రణ, వివాదాల పరిష్కారం, నిబంధనల అమలు వంటి అన్ని బాధ్యతలను భుజాన వేసుకుని జస్టిస్ పి. నవీన్ రావు ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించారు. HCA నిబంధనలకు అనుగుణంగా లీగ్ సజావుగా సాగేలా పర్యవేక్షించిన నవీన్ రావుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. గ్రామీణ యువతను క్రీడలకు మరింత దగ్గర చేసి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే అవకాశం కల్పించిన ఈ లీగ్ విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com