ఏపీలో 23 గ్రామ పంచాయతీలకు ISO సర్టిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లోని 23 గ్రామ పంచాయతీలు ISO 9001:2015 సర్టిఫికేషన్ సాధించాయి. ఈ వివరాలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
సర్టిఫికేషన్ పొందిన పంచాయతీలను, ఆ ఘనత కోసం కృషి చేసిన అధికారులు, సిబ్బందిని పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ గుర్తింపు కేవలం సర్టిఫికేట్ మాత్రమే కాదని, పంచాయతీల జవాబుదారీతనం, నాణ్యమైన సేవలకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
గ్రామ పంచాయతీల్లో సిటిజన్ చార్టర్ అమలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి ఉత్తమ పాలన ప్రమాణాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ 23 పంచాయతీలు స్ఫూర్తిగా ప్రతి గ్రామంలో మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. గ్రామీణాభివృద్ధి, సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com