వరి పంటలో ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు నివారణపై ఆదిలాబాద్ కేవీకే మార్గదర్శనం
వరి పంట పిలక దశలో ఉండగా కీటకాల నివారణపై ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రామగోపాల్ వర్మ రైతులకు సూచనలు ఇచ్చారు. ఇటీవలి వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు, వరి ఈగ వంటి చీడపీడల ఉదృతి పెరిగిందని ఆయన తెలిపారు. సరైన నివారణ చేపట్టకపోతే దిగుబడిలో 20 నుంచి 30 శాతం నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఉల్లికోడు నివారణకు 15 నుంచి 20 రోజుల దశలో ఫిప్రోనిల్ 0.3జి గుళికలను ఎకరాకు 8 కిలోలు లేదా 6జి గుళికలను ఎకరాకు 4 కిలోలు చొప్పున వాడాలని సూచించారు. కాండం తొలిచే పురుగు ఉనికిని గుర్తించేందుకు లింగాకర్షక బుట్టలు అమర్చి, వారానికి బుట్టకు 25-30 మగ రెక్కల పురుగులు పడితే ఆర్థిక నష్ట పరిమితి దాటినట్లుగా పరిగణించాలన్నారు.
పిలక దశ 25-30 రోజుల తర్వాత నారుమడిలో గుళికలు వేయని పొలాల్లో క్లోరంట్రానిలిప్రోల్ 4జి గుళికలు ఎకరాకు 4 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 8జి గుళికలు ఎకరాకు 8 కిలోలు 20-25 కిలోల ఇసుకలో కలిపి వాడాలని చెప్పారు. వరి ఈగ ఆశిస్తే ఎసిఫేట్ 1.5 గ్రాములు, ఇమిడక్లోప్రిడ్ 5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సలహా ఇచ్చారు.
పిలక దశలో సకాలంలో ఈ చర్యలు చేపడితే ఆరోగ్యకరమైన పైరుతో మంచి వెన్నులు ఏర్పడి అధిక దిగుబడి సాధించవచ్చని రామగోపాల్ వర్మ రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com