CPS ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంలోకి మారే అవకాశం: జీఓ 53 జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం CPS (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (OPS) లోకి మారే అవకాశం కల్పిస్తూ జీఓ జారీ చేసింది. దీనితో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు తెరపడింది.
జీఓ 53 ప్రకారం, 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన వారికి మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులతోపాటు, ఇప్పటికే పదవీ విరమణ చేసిన అర్హులైన ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ 31, 2026 లోగా తమ ఎంపికను సమర్పించాల్సి ఉంటుందని జీఓలో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా, కాలపరిమితిలో పూర్తి చేసేందుకు సమగ్ర మార్గదర్శకాలు జీఓలో పొందుపరిచారు. పూర్తి వివరాలు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చని ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో NPS అమల్లోకి రాకముందే నియామక ప్రక్రియ ప్రారంభమైన ఉద్యోగులకు ఒకేసారి అవకాశం (one-time option) ఇస్తూ కేంద్ర పెన్షన్ సంక్షేమ శాఖ 2020, 2023లో ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. ఆ పాలసీని యథాతథంగా స్వీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఇదే ప్రయోజనం కల్పిస్తున్నట్లు జీఓలో పేర్కొన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సుమారు 11,000 మంది ఉద్యోగులు CPS నుంచి OPS కి మారే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకంగా, జవాబుదారీతనంతో సాగాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. పాత పెన్షన్ విధానం అమలుపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com