బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం.. ఆదివారానికి వాయుగుండంగా బలపడే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం నాటికి ఈ వ్యవస్థ మరింత స్పష్టంగా కనిపించనుంది.
ఆదివారానికి ఇది వాయుగుండంగా బలపడుతుందని సంస్థ పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం ప్రభావంతోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోంది. వాయుగుండంగా మారిన తర్వాత అది ఏ దిశగా కదులుతుందనే దానిపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని అధికారులు తెలిపారు.
ఈ నెల 14 నుంచి 17 వరకు సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. రేపు, ఎల్లుండి అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అలల ఉద్రృతి పెరుగుతుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.
ఇప్పటికే రెండు వరుస తుఫాన్లతో ఏపీలో నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో అల్పపీడనం కదలికను వాతావరణ శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com