హైదరాబాద్ 24°C
అమరావతి 30°C
IST 9:41 PM
ఆదివారం జూలై 19 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుదల: కొత్త RF-5 వేరియంట్ గుర్తింపు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుదల: కొత్త RF-5 వేరియంట్ గుర్తింపు
📷 CP Khanal / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 16 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు, కడప, కృష్ణ, NTR జిల్లాలలో కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కడప జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తుల కరోనా శాంపుల్స్‌లో Omicron RF-5 వేరియంట్ నిర్ధారణ అయింది. NTR జిల్లా తిరువూరు మండలంలో 13 ఏళ్ల బాలికకు, నెల్లూరు జిల్లా నిండిగుంటపాలెంలో మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య నాలుగుకు చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

దేశవ్యాప్తంగా జూలై 1 నుండి ఇప్పటివరకు 339 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో Omicron RF-5 వేరియంట్ గుర్తించారు.

కరోనా వ్యాప్తిపై AP వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా DMHO లు, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, బోధన ఆసుపత్రుల అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ప్రతి ఆసుపత్రిలో PPE కిట్లు, కరోనా టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రులు, బోధన ఆసుపత్రుల వద్ద కిట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఐసోలేషన్ వార్డులు కూడా ఏర్పాటు చేశారు.

విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాల్లో వచ్చే ప్రయాణికులందరికీ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారిని సమీపంలోని బోధన ఆసుపత్రులలో ఐసోలేట్ చేస్తున్నారు. కాకినాడ, విశాఖపట్నం, కడప, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతాల్లో స్థానికంగా కేసులు నమోదవుతున్నాయి. వృద్ధులకే కాకుండా చిన్నారులకు కూడా కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఆయా ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, ANM లు ఇంటింటా వైద్య ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా సంబంధిత వ్యక్తులకు స్వాబ్ టెస్టులు చేస్తున్నారు. శాంపుల్స్‌ను పూణే ల్యాబ్‌కు పంపి వేరియంట్ నిర్ధారణ చేశారు.

RF-5 వేరియంట్ లక్షణాలు ప్రాణాంతకం కాదని వైద్యులు స్పష్టం చేశారు. అయితే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రం ఇది ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అనవసర రద్దీకి దూరంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com