టీమ్స్‌ను అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి దామోదర
మంత్రి దామోదర రాజ నరసింహ సనత్‌నగర్ లోని టీమ్స్ (TIMS) ఆసుపత్రిని సందర్శించారు. అన్ని రకాల అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు ఈ ఆసుపత్రిని కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఆసుపత్రిలో ఉన్న మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రీ-ఆపరేటివ్, పోస్ట్-ఆపరేటివ్ వార్డులు, ఐసియూలు తదితర వైద్య సదుపాయాలను మంత్రి పరిశీలించారు. అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ప్రభుత్వ వైద్యులు నైపుణ్యం కలిగి ఉన్నారని మంత్రి అన్నారు. ఇప్పటికే క్లిష్టమైన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని గుర్తు చేశారు.
సనత్‌నగర్ టీమ్స్ ను ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఎక్సలెన్స్ సెంటర్‌గా అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ రోగులకు అన్ని రకాల మార్పిడి సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు డాక్టర్లు చేయాలని మంత్రి కోరారు. నిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్ల కోసం వేచి ఉన్న రోగులకు టీమ్స్‌లో శస్త్ర చికిత్సలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని వైద్యులను ఆదేశించారు.
టీమ్స్‌లో పూర్తి స్థాయి సేవలు మొదలైన వెంటనే నిమ్స్ బృందాలు ఇక్కడి ఆపరేషన్ థియేటర్లను వినియోగించుకునేలా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్‌కు మంత్రి సూచించారు. టీమ్స్‌ను నిమ్స్ మాదిరిగా స్వయం ప్రతిపత్తి సంస్థగా నిర్వహిస్తామని, వైద్యులు, సిబ్బంది నియామకాలను కూడా అదే విధానంలో చేపడతామని మంత్రి వివరించారు.
ప్రభుత్వం టీమ్స్‌ను దేశంలోనే ప్రభుత్వ రంగంలో అత్యాధునిక ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలు, కార్డియో థొరాసిక్ సర్జరీలు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య, పరిశోధనల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి రావడం ద్వారా నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులపై ఉన్న ఒత్తిడి తగ్గుతుందని, ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సల కోసం రోగులు నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి తగ్గుతుందని మంత్రి దామోదర రాజ నరసింహ అభిప్రాయపడ్డారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com