జాకీలతో ఇంటిని 5 అడుగులు ఎత్తించి వరద నీటి సమస్యకు చెక్ పెట్టిన కుటుంబం
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన దూబగుంట్ల వెంకటేశ్వరరావు తన 40 ఏళ్ల నాటి ఇంటిని జాకీల సాయంతో ఐదు అడుగులు పైకి లేపారు. రోడ్డు ఎత్తు కంటే ఇల్లు పల్లంగా ఉండడంతో ప్రతి వర్షాకాలంలో నీరు ఇంట్లోకి చేరుతోంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి ఆయన ఈ పద్ధతిని ఎంచుకున్నారు.
వెంకటేశ్వరరావు తండ్రి సత్యనారాయణ 1985లో ఈ ఇంటిని నిర్మించారు. దాదాపు పదేళ్ల క్రితం వెంకటేశ్వరరావు ఇంటిపై మరో అంతస్తును నిర్మించారు. ఇంటి ముందు వెళ్తున్న రహదారి ఎత్తు పెరగడంతో ఇల్లు దాదాపు రెండు అడుగుల లోతులోకి వెళ్లిపోయింది. వర్షపు నీరు నేరుగా ఇంట్లోకి ప్రవేశించి ఇబ్బందులు కలిగించేది.
సామాజిక మాధ్యమాల్లో జాకీల ద్వారా ఇళ్లను ఎత్తించే విధానం గురించి తెలుసుకున్న వెంకటేశ్వరరావు విజయవాడకు చెందిన గుత్తేదారు సంస్థను సంప్రదించారు. దాదాపు 600 జాకీలు, 40 మంది కార్మికుల సాయంతో భవనాన్ని ఒకేసారి 5 అడుగుల మేర పైకి లేపారు. కింద కాంక్రీట్ బేస్ వేసి అన్ని జాకీలు అమర్చి ఏకకాలంలో పనులు పూర్తి చేశారు.
ఈ పద్ధతితో కేవలం రూ.30 లక్షల ఖర్చు అయిందని వెంకటేశ్వరరావు తెలిపారు. ఇదే ఇల్లు కొత్తగా నిర్మించాలంటే రూ.2 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. “మా నాన్నగారు కట్టిన ఇల్లు కూల్చేయాలని మనసొప్పలేదు. ఇప్పుడు అదే భవనం మరో 100 ఏళ్ల పాటు నిలిచేలా చేశాం” అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
స్థానిక కాంట్రాక్టర్ భావన ఋషి మాట్లాడుతూ, “బలమైన నిర్మాణాలు ఉంటేనే జాకీలతో ఎత్తించగలం. తడిసి, పెచ్చు ఊడిన భవనాలు ఈ ప్రక్రియకు పనికిరావు. ఇది చాలా సురక్షితమైన పద్ధతి” అని వివరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com