నేరాలు

రైల్లో మహిళల నుంచి బంగారం దోపిడీ; బాపట్లలో పోలీసుల కాల్పులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
రైల్లో మహిళల నుంచి బంగారం దోపిడీ; బాపట్లలో పోలీసుల కాల్పులు
📷 Kindel Media / Pexels
షేర్ కాపీ అయింది ✓

బాపట్ల జిల్లాలో ఈ తెల్లవారుజామున సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దొంగతనం జరిగింది. ట్రైనులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు దోచుకున్నారు.

చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్లే ఈ సర్కార్ ఎక్స్‌ప్రెస్ బాపట్ల శివారులోని నల్లమడవాగు వంతెన దగ్గరికి రాగానే, S3, S6 కోచ్‌ల్లో నిద్రిస్తున్న మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దుండగులు తీసుకెళ్లారు. ఘటన తెలుసుకున్న ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగింది. దుండగులు కిందికి దిగి పారిపోతుండగా అక్కడి ఎస్కార్ట్ పోలీసులు వారిపై కాల్పులు జరిపారు.

అయితే దుండగులు పొలాల్లోకి పారిపోయారు. పోలీసులు వారి బ్యాగులను పరిశీలించగా నాణేలు, వైర్ కట్టర్లు లభ్యమయ్యాయి. ఆరుగురు దుండగులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

గత రెండు నెలల్లో ఇదే మార్గంలో మూడు సార్లు ఇలాంటి దోపిడీలు జరిగాయి. గత నెల 19వ తేదీన కూడా పోలీసులు కాల్పులు జరిపారు. రైలు మరమ్మత్తు పనుల కారణంగా ఈ ప్రాంతంలో ట్రైను 20 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా వెళుతుండటంతో దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com